kudali

Tuesday, February 2, 2010

bodlapati roots

రాష్ట్ర వ్యాప్తంగా బోడ్లపాటి (ఒత్వం ఎక్కువ పడింది) వంశస్తులు చాలామందే ఉన్నట్లు అంతర్జాలం చూస్తుంటే తెలుస్తోంది. అందుకే బోడ్లపాటి రూట్స్ తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నా. సమయం దొరికినపుడల్లా కొంత పోస్ట్ చేస్తా. ప్రయత్నం నచ్చితే సహకరించండి. మీకు తెలిసిన సమాచారం అందించండి. ఇందులో అనేక కులాలు, జాతులు కలిసే అవకాశం ఉండొచ్చు. మనమంతా భారతీయులం అయినందున ఇదొక జాతి మూలాలను అన్వేషించే ఆంత్రోపాలజీ ప్రయత్నంగా సంతోషిద్దాం. అంతకు మించిన సాలిడారిటీ ఆశించడం లేదు.

నా పేరు శ్రీనివాస రావు. ఇంటి పేరు బోడ్లపాటి. ఊరు ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, తల్లంపాడు గ్రామము. మా ఊరు ఖమ్మం హైదరాబాద్ హైవే మీద హైదరాబాద్ నుంచి 192 కిలో మీటర్ల దూరంలో రోడ్డు మీదే ఉంటుంది. మా తాతలు ఏడు తరాల కింద(నేను ఎనిమిదవ తరం) గుంటూరు జిల్లా కోటప్ప కొండకు దగ్గరలోని ఒక ఉరి నుంచి తల్లంపాడు వచ్చారు. వారిని ఉజ్జిన్ని వారు అని కూడా పిలిచే వారట. గోత్రం వేనోళ్ళ అట. కులం కమ్మ అని చెప్పుకున్నారట. మా వంశ పురుషుడు సాంబయ్య. ఆయన, తల్లి, అన్న కలిసి బండి కట్టుకొని తల్లంపాడు వచ్చారు. తల్లంపాడులో మల్లిడి వారనే కమ్మ కులస్తులు ఉండే వారు. వాళ్ళు గుంటూరు జిల్లా లోని కొన్ని కమ్మ కుటుంబాల వివరాలు అడిగి వీళ్ళు కమ్మ వాళ్ళే అని నిర్ధారించుకొని కులంలో కలుపుకున్నారు. ఉరి అంచున ఉన్న అడవిని నరికి సాగు చేసుకోమని అప్పగించారు. ముగ్గురు కలిసి అతి కష్టం మీద ఎనిమిది ఎకరాలు సాగు చేశారు. ఇక కొడుకులకు పెళ్లి చేయాలి. అప్పటికే సాంబయ్యకు 40 ఏళ్ళు దాటాయి. పెద్దోడి వయసు ఇంకా ఎక్కువ. పిల్లను ఇవ్వడానికి ఎవరూ రాలేదు. మల్లిడి వారి ఇంట్లో ముదిరిపోయిన పిల్ల ఉంది. ఆలస్యంగా సమర్త ఆడింది. 16 -18 ఏళ్ల వరకు ఉండవచ్చు. వాళ్ళు ఆ ఒక్కి పిల్లను ఇవ్వడానికి నూటొక్క షరతులు పెట్టారు. పద్దెనిమిది ఎకరాల చేలో సాలు వంకర పోకుండా పదిమంది కాపుల ముందు కోండ్ర వేయల. సాంబయ్య తాడేసినంత సాయగా కోండ్ర వేశాడు. మరునాడే పెళ్లి ఖాయం చేశారు. ఎకరం పొగాకు తోట, కొన్ని రూపాయలు కట్నంగా ఇచ్చి ఘనంగా ఐదు రోజుల పెళ్లి చేశారు. కృష్ణా నది అవతలి నుంచి ఒకరో ఇద్దరో చుట్టాలు కూడా వచ్చారట. కాపురం మొదలైంది.

అంతకు ముందు ఎవరో దున్నలేక జరిమానా కట్టి వదిలించుకున్న భూములను ఇద్దరు అన్నదమ్ములు కట్నం డబ్బులను శిస్తుగా కట్టి సొంతం చేసుకున్నారు. ఇక ఏటా శిస్తు కట్టాలి. ఇల్లు గడిచి కాసులు వెనకేయాలి. తల్లి కొడుకులకు ఒకటే సొమ్ము యావ. నరనరాన ఇంకిన ఆ యావ మా నాన్న తరంతో గానీఆగిపోలేదు.

ఆ సాంబయ్య వంశంలో నా తరానికి నేనే పెద్ద. ఇప్పుడు నా వయసు 39 . భార్య, కూతురు(8 ). హైదరాబాద్ లో ఉంటున్నా.

మా ముత్త ముత్త ముత్తాతలు ఎందుకు గుంటూరు వదిలి వచ్చారో మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం.

9949610330 .